'గ్రూప్‌-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా'.. మంత్రి లోకేష్‌ హామీ

రాష్ట్రంలోని గ్రూప్‌-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

By అంజి  Published on  22 Feb 2025 6:54 AM IST
Minister Nara Lokesh, Group-II candidates, Group-II Exam, APnews

'గ్రూప్‌-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా'.. మంత్రి లోకేష్‌ హామీ

అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్‌-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని ట్వీట్‌ చేశారు. వారి బాధ, ఆందోళనను అర్థం చేసుకుని లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్టు తెలిపారు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూసి పెడతామని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో తప్పులు సరి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు శుక్రవారం రాత్రి విశాఖతో పాటు పలు పట్టణాల్లోని మెయిన్‌ సెంటర్లలో ఆందోళన నిర్వహించారు. వందలాది మంది సెల్‌ఫోన్‌ లైట్లు ఆన్‌ చేసి.. రోస్టర్‌ విధానాన్ని సవరించిన తరువాతే మెయిన్స్‌ నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీ నాడు నిర్వహించనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా.

Next Story