మీ ప్రేమను గెలుచుకునేందుకు చాలా కష్టపడ్డా, ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తా: మంత్రి లోకేశ్

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు.. చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు.

By Knakam Karthik
Published on : 13 April 2025 1:30 PM IST

Andrapradesh, Mangalagiri, Minister Nara Lokesh, Construction Of 100 Bed Hospital

మీ ప్రేమను గెలుచుకునేందుకు చాలా కష్టపడ్డా, ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తా: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గంలో అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు టీడీపీ నాయకులు, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని డాన్ బాస్కో పాఠశాల వద్ద ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేశ్ పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు.. చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు చేశారని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం టిడిపి పార్టీ తరఫున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేశ్ గుర్తు చేశారు.

హాస్పిటల్‌కు శంకుస్థాపన తర్వాత మంత్రి లోకేశ్ తన ఎక్స్‌ అకౌంట్‌లో ఇలా రాసుకొచ్చారు.. మంగళగిరి సమీపం చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. కూటమి నేతలతో కలిసి భూమిపూజ నిర్వహించిన అనంతరం శిలఫలకాన్ని ఆవిష్కరించాను. 1984లో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగాను. మంగళగిరి పట్టణంలో 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా చెప్పాను.

Next Story