అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే డీఎస్సీపై ముందుకెళ్దామని అడగడంతోనే ఆలస్యమైందని చెప్పారు. ఎస్సీ కమిషన్ రిపోర్టుపై నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ ఇంటర్, ఒకేషనల్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను ఉండవల్లి నివాసంలో “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో అభినందించే కార్యక్రమంలో మంత్రి లోకేష్ మెగా డీఎస్సీపై ప్రకటన చేశారు.
“షైనింగ్ స్టార్స్-2025” కార్యక్రమంలో విద్యార్థులను గోల్డ్ మెడల్ తో సత్కరించి ల్యాప్ ట్యాప్ లను బహూకరించారు. ''మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా. మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు. మిమ్మల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందాలి. కలల సాధనకు కష్టపడాలి.. ప్రోత్సహించే బాధ్యత నాది. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే మా లక్ష్యం'' అని లోకేష్ అన్నారు.