'వీడియోలు లేవు.. రహస్య కెమెరాలు లేవు'.. గుడ్లవల్లేరు ఘటనపై మంత్రి లోకేష్
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కెమెరాలు దాచిపెట్టారంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు.
By అంజి Published on 1 Sept 2024 3:11 PM IST'వీడియోలు లేవు.. రహస్య కెమెరాలు లేవు'.. గుడ్లవల్లేరు ఘటనపై మంత్రి లోకేష్
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కెమెరాలు దాచిపెట్టారంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు లేవని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇటీవలి వివాదాన్ని నిరాధారమని అన్నారు. గుడ్లవల్లేరు దుమారంపై లోకేష్ స్పందిస్తూ.. ఆరోపణలకు ఎలాంటి వీడియోలు, ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు.
ఆదివారం మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ''వీడియోలు లేవు. విద్యార్థులు క్యాంపస్‌లో ఎక్కడా రహస్య కెమెరాలను చూపించలేకపోయారు. మొత్తం సమస్య కల్పిత వివాదంగా కనిపిస్తోంది, కొంతమంది వ్యక్తులు నలుగురు వ్యక్తులకు సంబంధించిన వివాదంపై గందరగోళాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు'' అని అన్నారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేసి సెన్సేషన్ సృష్టిస్తున్నారని అన్నారు.
నారా లోకేష్ "బ్లూ మీడియా" అని పేర్కొన్న కొన్ని మీడియా విభాగాలు అనవసరమైన సంచలనాన్ని సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న తన పాత్ర కారణంగా తనను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా దుష్ప్రచారం జరుగుతుందని లోకేష్ సూచించారు. "మీడియా తప్పుదారి పట్టించే కథనాలను అందించడం కంటే నిజాన్ని చూపించడంపై దృష్టి పెట్టాలి," అని అన్నారు.
అంతకుముందు కాలేజ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. గురువారం రాత్రి మొదలైన విద్యార్థుల ఆందోళన శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్‌లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు రికార్డ్ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అలజడి రేగింది. విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ విద్యార్థులంతా ధర్నా చేపట్టారు.