అమరావతి: రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చాలా చోటల దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగటంపై ఆయన ఇలా స్పందించారు. భార్య, భర్తలువిడిపోయి ఏడేళ్లు దాటితే సింగల్ మెంబర్ కార్ఉలు ఇస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అవసరం అయితే రేషన్ కార్డుల దరఖాస్తు గడువును పొడిగిస్తామన్నారు. అటు రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యానులు ఉండవని మంత్రి నాదెండ్ల తెలిపారు.
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు పీడీఎస్ బియ్యం తీసుకోవాలని సూచించారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని చెప్పారు. గతంలో 29 వేల చౌక దుకాణాల ద్వారా బియ్యం సహా ఇతర సరకుల సరఫరా జరిగేదని, గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. 9 వేల 260 ఎండీయూ వాహనాల కోసం 18 వందల 60 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 30శాతం మందికి రేషన్ అందడం లేదని ఐవీఆర్‌ఎస్ సర్వేలో తేలిందన్నారు. ఈ క్రమంలోనే రేషన్ వ్యాన్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.