అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెన్షన్ ఉన్నవారు ఈ నెల 29 నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెంట్ల ప్రకటించారు. తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుందన్నారు.
24 నుంచి 48 గంటల్లో సిలిండర్‌ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు చెప్పాయని, పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే సరఫరా చేస్తామని తెలిపాయన్నారు. సిలిండర్ డెలివరీ చేసిన నిమిషం నుంచి 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తామని మంత్రి నాదెంట్ల వివరించారు. ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయిల్ కంపెనీలకు చెక్కు అందిస్తామని మంత్రి తెలిపారు.