మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను సందర్శించిన మంత్రి లోకేష్ బృందం
మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్‌లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు.
By Knakam Karthik
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను సందర్శించిన మంత్రి లోకేష్ బృందం
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్‌లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఏఐ గోస్టోర్‌లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగ దృశ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరిస్తూ... వ్యాపారులు, వినియోగదారులు, ప్రేక్షకుల కోసం సంయుక్తంగా రిటైల్, ఎడ్యుకేషన్ మద్దతును అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్‌లు, పరిశ్రమ పరిష్కారాలను ఊహించడం, ఆవిష్కరణల వర్క్‌షాప్‌లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్‌లు, క్లయింట్ల డిజిటల్ పరివర్తన మార్గాలపై దృష్టి సారించడం వరకు ఇక్కడ తమసేవలు విస్తరించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఈ కేంద్రాలను IBM, Dell వంటి కీలకమైన Microsoft కస్టమర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ట్రాన్సఫర్మేషన్ కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. IBM-Microsoft ఎక్స్‌పీరియన్స్ జోన్ ప్రత్యేకంగా క్లయింట్‌లకు Azure, Copilot వంటి సాంకేతికతలను ఉపయోగించి AI-ఆధారిత వ్యాపార పరిష్కారాలను చూపడంలో సహకరిస్తుందని చెప్పారు. అనంతరం ఎక్స్ పీరియన్స్ సెంటర్ చాంబర్ లో మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.