దేశంలోనే మొదటిసారి..ఏపీలో రేపు మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం

దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

By -  Knakam Karthik
Published on : 15 Dec 2025 3:33 PM IST

Andrapradesh, Vizianagaram District, Nara Lokesh, GMR Manasas Educity project, Aviation, Aerospace, Defense

దేశంలోనే మొదటిసారి..ఏపీలో రేపు మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం

అమరావతి: దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అభివృద్ధి చేయనున్న ‘జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్’ ను విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలో విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు 700 మిలియన్లకు చేరనున్నట్లు అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 1,700కు చేరనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ మార్కెట్ విలువ 2024లో 28.7 బిలియన్ డాలర్ల నుంచి 2034 నాటికి 57 బిలియన్ డాలర్లకు పెరగనుంది.

విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవవనరుల కొరత

విమానయాన రంగంలో దేశం గణనీయమైన నైపుణ్య లోటును ఎదుర్కొంటోంది. అర్హత కలిగిన పైలట్లు(12-15%), ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు(AMEs), విమాన భద్రతా నిపుణుల కొరత వేధిస్తోంది. ఏరోస్పేస్ డిజైన్, సస్టైనబుల్ ఏవియేషన్, ఏఐ/సైబర్ సెక్యూరిటీ, UAV వ్యవస్థలు, స్పేస్ టెక్నాలజీలో ఉన్నత కోర్సుల కొరత ఉంది. ఏటా కేవలం సుమారు 8వేల మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే బయటకు వస్తున్నారు. ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 0.5శాతం మాత్రమే.

దేశంలోనే తొలి సమగ్ర విద్య, ఆవిష్కరణ కేంద్రంగా ఏఏడీ(AAD) ఎడ్యుకేషన్ సిటీ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ దేశంలోనే ఏఏడీ రంగానికి అంకితమైన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ హబ్ గా నిలవనుంది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు తరలివస్తాయి. అంతర్జాతీయంగా పేరుగాంచిన యూనివర్సిటీల ఇంటర్నేషనల్ బ్రాంచ్ క్యాంపస్ లు(IBSc) ఏర్పాటుకానున్నాయి. అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్లు అప్లైడ్ టెక్నాలజీస్ పై దృష్టిసారిస్తాయి. స్టార్టప్ లు, పరిశ్రమలతో సహకారం కోసం ఇంక్యుబేషన్, ప్రోటోటైపింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. చైతన్యం, స్వయం సమృద్ధి గల ఎకోసిస్టమ్ కోసం నివాస, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ సిటీ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ(NCAP), ఎన్ఈపీ(NEP)-2020, మేకిన్ ఇండియా, డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఒక జాతీయ సామర్ధ్య వేదికగా పనిచేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశ ఏవియేషన్, ఏరోస్పేస్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ లలో గ్లోబర్ లీడర్ గా ఎదగడమే లక్ష్యం. 160 ఎకరాల్లో ఎడ్యుసిటీ క్యాంపస్ ను నిర్మించనున్నారు.

Next Story