జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం విదితమే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మంగళవారం అమరావతిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కానీ కావాలని కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు.. మన విద్యార్థులు నేర్చుకొంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ.. త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
జాతీయ విద్యా విధానంపై డీఎంకే, బీజేపీ నాయకులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. త్రిబాషా సూత్రం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు అక్కడి ఎంపీలు సైతం ఆరోపిస్తున్నారు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ కాదని, తమిళ్, ఇంగ్లీష్ విధాన్నాన్ని మాత్రమే తమ రాష్ట్రంలో అమలు చేస్తామని డీఎంకే లీడర్లు అంటున్నారు. దీంతో కేంద్రానికి, తమిళ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది.