రెడ్ బుక్‌లో జగన్ పేరు ఉందా?.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయి వేదికగా జరిగిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా-2026' సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By -  అంజి
Published on : 28 Feb 2026 11:13 AM IST

Nara Lokesh, Red Book, Jagan Mohan Reddy, Pawan Kalyan, Ideas of India 2026, Amaravati Construction, TTD Laddu Controversy

రెడ్ బుక్‌లో జగన్ పేరు ఉందా?.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు 

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయి వేదికగా జరిగిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా-2026' సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు, తిరుమల లడ్డూ కల్తీ వివాదం, అమరావతి నిర్మాణం, పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధంపై ఆయన మనసు విప్పి మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వారి కోసం రూపొందించిన 'రెడ్ బుక్'పై లోకేశ్ స్పష్టత ఇచ్చారు. "రెడ్ బుక్‌లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు, అధికారులను వేధించిన వారు, దాడులకు ప్రేరేపించిన ఏ రాజకీయ నేతనైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు" అని ఆయన హెచ్చరించారు. 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ వివాదంపై క్షమాపణ

గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో రసాయనాలు వాడటం, కల్తీ జరగడం దురదృష్టకరమని లోకేశ్ అన్నారు. "రాష్ట్ర మంత్రిగా ఈ అపచారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. సిట్ నివేదిక ప్రకారం టీటీడీ మాజీ ఛైర్మన్ సహా ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. భవిష్యత్తులో ఇలాంటి నేరం చేయాలంటే భయపడేలా చర్యలు ఉంటాయి" అని అన్నారు. అంతేకాకుండా, తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

పవన్ నాకు 'బిగ్ బ్రదర్'

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకున్న సంబంధంపై అడిగిన ప్రశ్నకు లోకేశ్ ఎమోషనల్‌గా సమాధానమిచ్చారు. "కష్టకాలంలో మా కుటుంబానికి వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు ఎప్పుడూ 'పెద్దన్నే'. జీవితాంతం ఆయన నాకు బిగ్ బ్రదర్‌గా ఉంటారు" అని పేర్కొన్నారు.

అమరావతి.. పెట్టుబడులకు స్వర్గధామం

ఏపీ ఆర్థికాభివృద్ధిపై లోకేశ్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను వివరించారు.పారిశ్రామికవేత్తలు ప్రతి 100 రోజులకు ఒకసారి అమరావతిని సందర్శించాలని, అక్కడ నిర్మాణాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని కోరారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఆర్థిక మండలాలుగా తీర్చిదిద్దుతున్నామని, అన్ని రంగాల అనుబంధ పరిశ్రమలను ఒకే చోట చేర్చేలా 'క్లస్టర్' డెవలప్‌మెంట్ చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని, చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం పెట్టుబడులు, తదుపరి తరం విద్యకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

Next Story