Andhrapradesh: త్వరలోనే కొత్తగా 5 లక్షల మందికి పింఛన్లు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ వినిపించింది. త్వరలోనే వితంతువులకు కొత్తగా పింఛన్లు అందిస్తామని చెప్పింది.
By అంజి
Andhrapradesh: త్వరలోనే కొత్తగా 5 లక్షల మందికి పింఛన్లు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ వినిపించింది. త్వరలోనే వితంతువులకు కొత్తగా పింఛన్లు అందిస్తామని చెప్పింది. రాష్ట్రంలో 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇస్తామని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లా గంట్యాడలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని తెలిపారు. వారందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారతలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు.
స్వయం సహాయక సంఘాలను మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మండలానికి ఒక మహిళా భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. దీనిని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే పేదరిక నిర్మూలన కోసం నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి, వారి ద్వారా మెరుగైన జీవనం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే.. నిన్న గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం లో రాయితీ పై 2.5 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలను రైతు కుటుంబాలకు మంత్రి కొండపల్లి అందించారు. ఈ సందర్భంగా తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పారు. పేద రైతులకు ఈ వ్యవసాయ పరికరాలు మరింతగా ఉపయోగపడతాయి. వ్యవసాయ రంగానికి మరింత చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.