అమరావతి: డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు వీలుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 'స్త్రీనిధి' యాప్‌ను ప్రారంభించారు. సెర్ప్, స్త్రీనిధి, యూనియన్ బ్యాంకు అధికారులతో కలిసి మంత్రి ఈ యాప్‌ను ప్రారంభించారు. దీని వాడకంపై మహిళలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నేరుగా బ్యాంకుకు వెళ్లి రీపేమెంట్ చేయాల్సి ఉండటంతో సమయం వృథా అవుతోందన్నారు. యాప్ ద్వారా చెల్లింపులతో పారదర్శకత ఉంటుందని చెప్పారు. డిజిటల్ విధానంలో రుణాల చెల్లింపులతో సమయం ఆదా అవుతుందన్నారు.
స్త్రీనిధి - ఆంధ్రప్రదేశ్, డిజిటల్ విధానం ద్వారా రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ తెలిపారు. పేద మహిళలకు రుణాలను ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా 48 గంటల్లోపు అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ రుణాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, భద్రమైన చెల్లింపుల్లో మరింత పురోగతిని సాధించడం కో సం ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. సెర్ప్ సంస్థలో స్త్రీనిధి అంతర్భాగమని, గ్రామీణ, పట్టణాల్లో ఉన్న పేద మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతోందని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ అన్నారు.