అమరావతి: రాష్ట్రంలోని వితంతువులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్‌ను అర్హులైన వారందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొండపల్లి తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ జారీ పద్ధతిని మరింత సరళీకృతం చేసిందన్నారు. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే.. భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చామన్నారు. కొత్తగా 1,09,155 మంది వితంతు పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు.
వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి రూ.43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుందని మంత్రి గురువారం నాడు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా భర్త చనిపోతే.. ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పౌజ్ కేటగిరిలో పింఛన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న స్పౌజ్ కేటగిరిలో అర్హులకు నెలకు రూ.4వేలు డబ్బుల్ని అందజేయనున్నారు.