ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు. పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్క్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, కృష్ణాపురంలో రూ. 12.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఎంఎస్ఎంఈ పార్క్ పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, నాయకులతో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా వేదికపైకి దూసుకువచ్చారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో జనం రావడంతో భారం తట్టుకోలేక సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, అదృష్టవశాత్తూ మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అధికారులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.