ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి పేరు వింటే చాలు అంతెత్తున విరుచుకుప‌డే మంత్రి కొడాలి నాని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాడు అలా జ‌రిగి ఉంటే.. నేడు గుంటూరు లాంటి సంఘటనలు జరిగేవి కావ‌న్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

లోకేశ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. జగనన్న విద్యాకానుక ప్రజల్లో వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేష్ కొత్త నాటకానికి తెరతీశారని కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌లకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలనేదే తమ ప్రభుత్వం అభిమతమని గుర్తు చేశారు. అందుకే దిశ చట్టం, యాప్ ప్రవేశపెట్టామన్నారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని 12 గంటల్లోగా అరెస్టు చేశామ‌ని మంత్రి తెలిపారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story