మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Minister Kodali Nani fires on Chandrababu.నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బతికుండగా ముఖ్యమంత్రి జగన్‌ను
By తోట వంశీ కుమార్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బతికుండగా ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించలేరని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రెండేళ్ల పాలన చూశాక 2014లో జగన్‌కు అధికారం ఇచ్చి ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. బాబుకు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా నాశనం చేశారని మండిపడ్డారు.
2004, 2009లోనూ చంద్రబాబును వైఎస్ఆర్ ఓడించారని ఆయన గుర్తు చేశారు. 2019లో వైఎస్ జగన్‌ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని ఆరోపించారు. జగన్ మాత్రం ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుపడిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఏపీలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక.. జూమ్ నుంచి పప్పునాయుడు, తుప్పునాయుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతారని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని తాము వదిలిపెట్టబోమన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అలాగే.. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ మళ్లీ అధికారంలోకి వస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని వచ్చినా చంద్రబాబు నాయుడు గెలవలేడని ఆయన జోస్యం చెప్పారు. కరోనా వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని చెప్పారు. జగన్ బాటలోనే కేంద్ర ప్రభుత్వం కూడా నడిచిందని తెలిపారు. జగన్ పాలనలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.