అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన చిన్న, సన్నాకారు రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. ఇందులో కేంద్ర పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలు కలిపి ఉంటాయి. జూన్ 12వ తేదీన మొదటి విడత డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి.
''అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న "అన్నదాత సుఖీభవ" పథకం జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన చిన్న, సన్నకారు రైతులు, జారాదారులకు ఆర్థిక భరోసా అందించబడుతుంది. అన్నదాతకు తోడుగా నిలబడే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని మంత్రి దుర్గేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.