వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ...
By - అంజి |
వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ అందించారు. సామర్లకోటలోని కుమ్మరి వీధిలో ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా కుటుంబాలను పరామర్శించిన మంత్రి.. అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చారు.
మరణించిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఆర్ఎఫ్ నుండి ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కలిపి మొత్తం రూ.22 లక్షల ఆర్థిక సాయం అందనుంది.
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం (ఫిబ్రవరి 28, 2026) మధ్యాహ్నం సంభవించిన పెను ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, మృతదేహాలు సమీపంలోని వరి పొలాల్లో అర కిలోమీటరు దూరం వరకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో యూనిట్ యజమాని అడబాల శ్రీనివాస్ కూడా మరణించారు. శనివారం 20 మంది చనిపోగా, ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరొకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే (9 మంది)
కేవలం 8 మందికి మాత్రమే అనుమతి ఉన్న చోట, దాదాపు 31 మందిని పనిలో పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. భారీగా పేలుడు పదార్థాలను నిల్వ చేయడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ పెద్దాపురం ఆర్డీఓ, డీఎస్పీ, జిల్లా లేబర్ ఆఫీసర్ మరియు ఫైర్ ఆఫీసర్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే సస్పెండ్ చేశారు.