సుందర.. నీకెందుకు అంత తొందరా.. మంత్రి కౌంటర్
ఆనంపై దాడి ఎవరు చేశారనేది పోలీసులే తేలుస్తారని అన్నారు. విచారణ పూర్తి కాకుండానే, దాడికి బాధ్యులు ఎవరనేది
By అంజి Published on 6 Jun 2023 4:37 PM ISTతెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వెంకటరమణా రెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. నెల్లూరులోని ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 10 మంది బైక్ల పై వచ్చి కర్రలతో దాడికి ప్రయత్నింగా.. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ నారా లోకేష్‌తో పాటు, ఇతర టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం అధ్వర్యంలో మేదోమధన సదస్సులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనంపై దాడి ఎవరు చేశారనేది పోలీసులే తేలుస్తారని అన్నారు.
విచారణ పూర్తి కాకుండానే, దాడికి బాధ్యులు ఎవరనేది గుర్తించకుండానే.. సజ్జల పేరు, ముఖ్యమంత్రి పేరు, తన పేరు, ఇలా ఎవరికి తోచిన పేరు వాళ్లు చెబుతున్నారని మంత్రి కాకాణి ఫైర్ అయ్యారు. ఆనంపై దాడి జరిగిందనేది నిర్దారణ జరిగిన తర్వాత.. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అనే సంబంధం లేకుండా నిందితులను పట్టుకుని పోలీసులు శిక్షిస్తారని అన్నారు. ఇందులో లాలూచీ వ్యవహారం, ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే కోర్టులో చోరీ విషయంలో ఏం జరిగిందనేది తేలుతుందన్నారు. అప్పుడే ఈ అంశంపై స్పందిస్తానని మంత్రి కాకాణి అన్నారు.
కోర్టు సంబంధించినటువంటి చోరీ కేసులో సీబీఐ ఎంక్వైరీని స్వాగతిస్తున్నానని మంత్రి తెలిపారు. సుందర.. నీకెందుకు అంత తొందరా అంటూ సెటైర్ వేశారు. విచారణ పూర్తవుతోందని, వాస్తవాలు త్వరలో వెలుగు చూస్తున్నాయని, ఆ రోజు వాస్తవాల గురించి మాట్లాడుకుందామని అన్నారు. అంతకుముందు.. వ్యవసాయం రైతుకు లాభసాటిగా మార్చాలని సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. రైతులకు మరింత వెసులుబాటు కలిగించేలా కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రైతు అసలైన శాస్త్రవేత్త అని.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.