జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై మంత్రి దుర్గేశ్ మండిపడ్డారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలిచ్చారు. సినిమా పరిశ్రమ మన రాష్ట్రంలో సాంస్ఖృతిక విలువల ప్రతిబింబంగా వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతోందన్నారు. ఈ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే మంత్రి దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని దుర్గేష్ స్పష్టం చేశారు. కారకులు ఎవ్వరైనా సరే వదిలిపెట్టమని హెచ్చరించారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత రెవెన్యూ నష్టం వస్తుందనే దానిపై వివరాలు సేకరించాలని ఆదేశించారు.