అమరావతి: దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, మీసేవా, మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. స్లాట్ బుకింగ్ రోజు నుంచి నెలలోగా ధ్రువపత్రాలు అందజేయాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగుల సౌకర్యం కోసం ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 70 ఏళ్లు దాటిన వారికి ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వందన ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు.
వయోవృద్ధుల ఆరోగ్య భద్రతకు.. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అటు దివ్యాంగులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి డోలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.