అమరావతి: వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో బీపీటీ రైస్‌తో భోజనం అందించనున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టు మెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
గత ప్రభుత్వంలో దళితులకు మేనమామను అంటూ వైఎస్ జగన్ దగా చేశారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హాస్టళ్లలో మరమ్మతులకు ఖర్చు చేసింది కేవలం రూ.27 కోట్లు మాత్రమేనని తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 210 మంది విద్యార్థులున్న హాస్టల్... వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల 30 మందికి పడిపోయిందన్నారు. ఆ హాస్టల్‌ని మరమ్మతులు చేసి ఆధునీకరించామని తెలిపారు.