అమరావతి: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా.. 2024 ఎన్నికల ముందు కూటమి నాయకత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను దశలవారీగా అమలు చేస్తోంది. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సూపర్ - 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సంవత్సరం మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. “మేం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూపర్ సిక్స్ పథకాల అమలులో వడివడిగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రం నష్టాల్లో ఉన్నా ప్రజల అవసరాలు ముందుగానే చూస్తున్నాం” అని మంత్రి పేర్కొన్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఈ పథకం ద్వారా రూ.15,000 ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల చదువు కోసం తల్లులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది.