వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక నిర్వహణ మెరుగుపడిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అప్పులు అసాధారనంగా పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. రాష్ట్రంలో అప్పులు రూ.8 లక్షల కోట్లకు చేరాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు అబద్ధమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల కోట్లు ఆదాయం తగ్గిందని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. ప్రభుత్వ వనరులు తగ్గుతున్నా సంక్షేమ పథకాలు ఏవీ ఆపడం లేదన్నారు. ప్రజల ఖాతాల్లోకి రూ.57 వేల 512 కోట్లు జమ చేసి ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో రాష్ట్ర పరిస్థితికి ఇప్పటి పరిస్థితి పోల్చి చూడాలన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో పబ్లిక్ సెక్టారు యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి చేసిన అప్పులు 15.5 శాతం మాత్రమే పెరిగాయని చెప్పారు.
వేస్ అండ్ మీన్స్‌ను రిజర్వుబ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిన సదుపాయమని చెప్పారు. ఆర్థిక అవసరాలను బట్టి ఆయా ప్రభుత్వాలు.. ఎన్నిసార్లైనా వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లవచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వం రూల్స్ విరుద్ధంగా వెళ్తే ఎందుకు పర్మిషన్ ఇస్తుందన్నారు. ఓవర్ డ్రాఫ్టు తీసుకోవడం, తిరిగి చెల్లించడం జరుగుతుందని, ఇది అదనపు అప్పు కాదని బుగ్గన తెలిపారు.