మూడు రాజధానులపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. ఒకటికి 10 సార్లు చెబుతున్నాం
Minister Botsa Satyanarayana Key comments on the 3 capitals of AP.ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు తీర్పు చెప్పిన
By తోట వంశీ కుమార్ Published on 5 March 2022 4:59 PM ISTఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు తీర్పు చెప్పిన అనంతరం మరోసారి ఏపీ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓ వైపు ప్రతిపక్షనేతలు అంటుంటే.. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మరో వైపు అధికార వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ తప్పనిసరి అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందని, అందులో కూడా పాలన వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ఇక.. తెలుగుదేశం పార్టీ నేతలు తమకు ప్రామాణికం కాదని తేల్చి చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై బిల్లు పెట్టే అంశంపైనా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. విజయనగరం జిల్లా పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఉగాదికి కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని తెలిపింది.