శ్రీకాకుళం జిల్లాలో టీచర్ల తీరుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. విద్యార్థులకు పాఠాలు సరిగ్గా బోధించడం లేదని గ్రామస్తుల ఫిర్యాదుతో టీచర్లపై మండిపడ్డారు. టీచర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి బొత్స.. చీపురుపల్లి మండలంలోని పలు భవనాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కరకం, పత్తి కాయవలస గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల చదువు సమస్యలను మంత్రి బొత్సకు తెలిపారు. తమ గ్రామంలోని స్కూళ్లలో టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని మంత్రి బొత్సకు తెలిపారు. దీంతో ఎంఈవో, టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు అప్పగించడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతోందని వివరణ ఇవ్వగా మంత్రి బొత్స మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.