అంగన్వాడీల 10 డిమాండ్లను నెరవేర్చాం: మంత్రి బొత్స
అంగన్వాడీల సమ్మె ముగిసిందని.. త్వరలో అంగన్వాడీలు విధుల్లో చేరనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
By అంజి Published on 23 Jan 2024 7:05 AM IST
అంగన్వాడీల 10 డిమాండ్లను నెరవేర్చాం: మంత్రి బొత్స
ఏపీ: అంగన్వాడీల సమ్మె ముగిసిందని.. త్వరలో అంగన్వాడీలు విధుల్లో చేరనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అంగన్వాడీల 11 డిమాండ్లకు గానూ 10 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చినట్టు మంత్రి బొత్స తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని, వారికి జీతాలను జులైలో పెంచుతామని తెలిపారు. మరోవైపు తమ డిమాండ్లపై ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇచ్చిందని అంగన్వాడీలు చెప్పారు. సమ్మె విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం 42 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు 'చలో విజయవాడ' కార్యక్రమం నేపథ్యంలో ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ నెల 24న ఏపీ బంద్‌కు ఆ సంఘాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చుతామని మంత్రి బొత్స తెలిపారు.
అంగన్వాడీలకు అచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రూ.లక్ష 20 వేలకు పెంచామని, అలాగే హెల్పర్లకు రూ.60 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మినీ అంగన్వాడీలను త్వరలో పూర్తి స్థాయి అంగన్వాడీలుగా మారుస్తామన్నారు. సమ్మె చేసిన కాలానికి ఏం చేయాలన్నదానిపై సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు.