అమరావతి: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభనపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోళ్ల మృతిపై వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబుకు పంపాలన్నారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయిలో సర్వైలైన్స్ ఉండాలని స్పష్టం చేశారు.
పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని మంత్రి అచెన్న ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు.