అమరావతి: ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం అమలు నేపథ్యంలో అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌పీసీఐలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేయాలన్నారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ పథకంకు అర్హత ఉన్న వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని సూచించారు.
ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్టు మంత్రి అచెన్న ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకం నిధులను విడుదల చేస్తారని మంత్రి అచ్చెన్న తెలిపారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.