హీరో నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కౌంటర్
Minister Anil kumar yadav Counter on Actor nani comments.ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలపై
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2021 7:04 AM GMTఏపీలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. సినీ హీరోలు పారితోషకం తగ్గించుకుంటే టికెట్ల ధరలు మరింత తగ్గుతాయన్నారు. సినీ పరిశ్రమలో దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తనకు కొడాలి నాని తప్ప ఇంకా ఏ నాని తెలియదన్నారు. గురువారం 'శ్యామ్‌సింగరాయ్' చిత్ర ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో హీరో నాని మాట్లాడుతూ.. సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల్ని అవమానించేలా ఉందని వ్యాఖ్యానించగా.. శుక్రవారం నెల్లూరులో మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు.
'టికెట్ రేట్ తగ్గితే రెమ్యునరేషన్ తగ్గుతుందని వాళ్లు బాధపడుతున్నారు. 'భీమ్లా నాయక్', 'వకీల్‌సాబ్'కి పెట్టిన ఖర్చెంత?. పవన్‌కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..?. ప్రజలని ఉద్దరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా. పవన్ క్రేజ్‌ని అమ్ముకుంటున్నాడ'న్నారు. ఇక సినిమాకయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయన్నారు. ఆ నలుగురు తీసుకునే కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి మేం పర్మిషన్ ఇవ్వాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు తాను కూడా బైక్ అమ్మి పవన్‌కల్యాణ్‌కి కటౌట్‌లు కట్టానని.. ఉన్న డబ్బులు ఊడగొట్టుకున్నట్లు చెప్పారు. అలాగే అభిమానులు ఆవేశపడి జేబులు గుల్ల చేసుకోవద్దు అంటూ సూచించారు. గతంలో చారిత్రక, సందేశాత్మక చిత్రాలకు రేట్లు పెంచుకునేవారని, అయితే.. ఇప్పుడు అన్ని సినిమాలకు పెంచడం ఏంటి? అని ప్రశ్నించారు. ఇక హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే సినిమా టికెట్ల ధర తగ్గుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. హీరోలకు కండుమంట ఎందుకని ప్రశ్నిచారు.