అమరావతి: రాష్ట్రంలో జరిగిన భూకబ్జాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి విమర్శించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా 8,305 ఎకరాలు కబ్జా జరిగినట్టు ఫిర్యాదు అందాయని మంత్రి అనగాని తెలిపారు. 7,873 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు గుర్తించామన్నారు. కబ్జాకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములపై పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు.
అటు భూముల కబ్జాపై కాలపరిమితితో కూడిన హౌస్ కమిటీ వేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు. దీనిపై మంత్రి అనగాని స్పందించారు. ''గత ప్రభుత్వంలో 25 వేల ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్ జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. భూకబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం. భూకబ్జాలకు పాల్పడిన వారికి 10 నుంచి 14 ఏళ్ల శిక్ష పడేలా కొత్తం చట్టం ఉంటుంది. కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉంటాయి'' అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.