నెల్లూరు జిల్లాలో సోమవారం భూమి కంపించింది. చేజర్ల మండలంలోని ఆదూరుపల్లిలో మూడు సెకన్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఇళ్లల్లోని వస్తువులు కింద పడి పోయాయి. భయంతో ప్రజలు చాలా సేపు ఇళ్ల బయటే ఉండిపోయారు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇటీవల నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో జిల్లాలోని నాలుగు మండలాల్లో భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.5గా నమోదు అయ్యింది. ఉదయం 8.33 గంటల సమయంలో తెహ్రీకి సమీపంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.