పలాసలో అర్ధరాత్రి హైడ్రామా.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది.

By అంజి  Published on  2 July 2023 10:31 AM IST
Palasa, TDP MP Rammohan Naidu, MLA Ashok, APnews

పలాసలో అర్ధరాత్రి హైడ్రామా.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సాగునీటి కాలువపై 15 ఏళ్ల కిందట కల్వర్టు నిర్మించుకున్నారు. అయితే ఈ కల్వర్టును అక్రమంగా నిర్మించారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కల్వర్టు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉందని, దానిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి అధికారులు కూల్చివేత సామాగ్రితో కల్వర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

టీడీపీ నాయకుడు నాగరాజును ఇబ్బందులకు గురి చేసేందుకే కల్వర్టు కూల్చేందుకు సిద్ధం అయ్యారని టీడీపీ నాయకులు ఆరోపించారు. నాగరాజుకు మద్దతుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటూ పలువురు టీడీపీ నాయకులు కల్వర్టు దగ్గర ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు సిబ్బంది రంగలోకి దిగారు. అధికారులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి సిదిరి అప్పలరాజు ఆదేశాలతోనే అధికారులు తన ఇంటికి దారి లేకుండా చేస్తున్నారని టీడీపీ నేత నాగరాజు ఆరోపించారు. టీడీపీ కోసం పనిచేస్తున్నాననే కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని నాగరాజు అన్నారు.

Next Story