అమరావతి: రాష్ట్రంలో క్రమ క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
రానున్న రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం ఉంటుందని, అందుకు తగ్గట్టు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రతి ఏటా మార్చి నుంచి ఎండల ప్రభావం కనిపించేది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.