జనసేన చీఫ్ పవన్‌ను గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి వీడియో

పవన్ కల్యాణ్‌కు మద్దతుగా వీడియో చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌ వేదికగా దాన్ని పోస్టు చేశారు.

By Srikanth Gundamalla  Published on  7 May 2024 12:01 PM IST
megastar Chiranjeevi,  pawan kalyan, election, Andhra Pradesh,

జనసేన చీఫ్ పవన్‌ను గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి వీడియో  

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లోనే జరగనుంది. ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉన్న నేపథ్యంలో జోరుగా ఓటర్లను కలుస్తున్నారు. రాజకీయ పార్టీల అగ్రనేతలు ఎండను కూడా లెక్కచేయకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఏపీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లో కలియ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థులతో పాటు ఉమ్మడిగా దిగిన వారిని కూడా గెలిపించాలని కోరుతున్నారు.

ఇక జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచార రంగంలోకి దిగారు మెగా హీరోలు. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ పవన్ కల్యాణ్ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు.

పవన్ కల్యాణ్‌కు మద్దతుగా వీడియో చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌ వేదికగా దాన్ని పోస్టు చేశారు. అందరికీ మేలు జరగాలి, మంచి జరగాలని అనుకునే వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరని చిరంజీవి అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక అది చేస్తా ఇది చేస్తా అంటారు.. కానీ పవన్ కల్యాణ్‌ మాత్రం ఎలాంటి పదవి లేకున్నా ప్రజలకు అండగా నిలిచారు. రైతులు, మత్స్యకారులు, సరిహద్దుల్లో కాపలాగా ఉన్న జవాన్లకు సాయం చేశారని గుర్తు చేశారు. సినిమాల్లోకి పవన్ కల్యాణ్‌ ఇష్టం లేకుండానే వచ్చారని చిరంజీవి చెప్పారు. కానీ.. రాజకీయాల్లోకి మాత్రం పవన్ ఇష్టంగా వచ్చారనీ.. ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటాడని చెప్పారు. పవన్ తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. జనమే జయం అని నమ్మే పవన్‌ కల్యాణ్‌ ఏదైనా చేయగలడు.. ఇది తెలుసుకోవాలంటే పిఠాపురం ప్రజలు గాజు గ్లాసు గుర్తుకి ఓటువేసి గెలిపించాలని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు.


Next Story