అమరావతి: అన్ని అడ్డంకులు దాటుకుని మెగా డీఎస్సీ - 2025ని 23 రోజుల్లో సజావుగా నిర్వహించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ ప్రాథమిక 'కీ' విడుదల చేశామని, అభ్యర్థనలు పరిశీలించాక తుది 'కీ' విడుదల చేస్తామన్నారు. కోర్టు కేసులతో డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేసిందని మండిపడ్డారు. కోర్టులో 31 కేసులు వేసినప్పటికీ పరీక్షలు నిష్పాక్సికంగా, పారదర్శకంగా జరిగాయన్నారు. ఎస్సీ ఉప వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి నియమాలను ఖచ్చితంగా అనుసరించినట్లు వివరించారు.
3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు దాఖలు చేయగా, 92.9% మంది పరీక్షలకు హాజరైనట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. మెగా డీఎస్సీలో భాగంగా జూన్ 6 నుంచి జూన్ 28 వరకు జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను గురువారం విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలను మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని సంబంధిత ఆధారాలతో జూలై 11 లోపు https://apdsc.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.