జీజీహెచ్ లో ఎంపీ రఘురామకృష్ణకు వైద్య పరీక్షలు
Medical Tests For MP Raghu Ramakrishna Raju. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణకు గుంటూరులోని జీజీహెచ్ వైద్య పరీక్షలు నిర్వహించారు.
By Medi Samrat Published on 16 May 2021 3:51 PM ISTనర్సాపురం ఎంపీ రఘురామకృష్ణకు గుంటూరులోని జీజీహెచ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని రఘురామకృష్ణ రాజు సీఐడీ కోర్టుకు తెలిపారు. ఆయన తరఫున న్యాయవాదులు సైతం విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదయం 10.30 గంటల వరకు పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని జిల్లా కోర్టు, మధ్యాహ్నం 12 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ శనివారం ఆదేశించింది. ఈ క్రమంలో ఆదివారం ఆయనను పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షలు ఆలస్యంగా నిర్వహిస్తూ ఉన్నందుకు ఎంపీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలించేలా రఘురామకృష్ణ వ్యాఖ్యలు చేశారని రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు ఆయనను హైదరాదాబాద్‌లో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. జిల్లా కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తన కాళ్లకు గాయాలయ్యాయని, పోలీసులు తనను కొట్టడం వల్లే గాయపడ్డానని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి శనివారం తెలియజేశారు. తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఏపీ సీఐడీ అధికారులు శనివారం సాయంత్రం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు రిమాండ్ నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. మరో వైపు రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ హై కోర్టులోనూ దాఖలు చేశారు.