ఆంధ్రాలో ఆ వైరస్ ప్రభావం అంతంతమాత్రమే.. భయపడొద్దు
కొత్త రకం ఫ్లూ 'హెచ్3ఎన్2' ప్రభావం పెద్దగా లేదని ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. వినోద్‌కుమార్ తెలిపారు.
By అంజి Published on 10 March 2023 11:32 AM ISTఆంధ్రాలో ఆ వైరస్ ప్రభావం అంతంతమాత్రమే.. భయపడొద్దు
ఏపీ: రాష్ట్రంలో కొత్త రకం ఫ్లూ 'హెచ్3ఎన్2' ప్రభావం పెద్దగా లేదని ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధుల వ్యాప్తిపై ప్రభుత్వం చాలా అప్రమత్తంగానే ఉందని వివరించారు. అనవసర భయాలు అక్కర్లేదని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 21 హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలోని వీఆర్‌డీఎల్‌లో నిర్వహించిన పరీక్షల్లో జనవరిలో 12, ఫిబ్రవరిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు.
హెచ్3ఎన్2 అనేది ఇన్‌ఫ్లుఎంజా ఎ టైప్ వేరియంట్ వల్ల వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్ అని, ఇది ఎగువ శ్వాసనాళంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ జనసమూహంలో తిరిగే లేదా తరగతి గదులు, కార్యాలయాలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారిని ప్రభావితం చేస్తుంది. ఇది సోకిన వ్యక్తి ద్వారా దగ్గు లేదా తుమ్ము నుండి చుక్కల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు అరుదైన సందర్భాల్లో కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ మూడు, నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన వారు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.
దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు ఉన్నవారు మాస్క్‌లు ధరించాలని, అలాంటి పిల్లలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు తరగతులకు దూరంగా ఉండాలని సూచించారు. నివారణ సంరక్షణగా టీకా సిఫార్సు చేయబడింది. దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరు కప్పుకోవాలని, తరచుగా నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, విశ్రాంతి తీసుకోవాలని, పుష్కలంగా ద్రవాలు, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమాల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్ మాత్ర వాడితే సరిపోతుందన్నారు. అదే విధంగా గొంతు ఇన్‌ఫెక్షన్ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్ బిళ్లలు వాడాలన్నారు.