ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భారీ చోరీ జరిగింది. ఆలయం వెనుక ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు.. గర్భగుడిలో స్వామి వారికి అలంకరించిన నగలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ. 60 లక్షల వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్త ముకుంద పండా వెల్లడించారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు ముకుంద పండా ఫిర్యాదు చేశారు.
అయితే ఏకాదశి సందర్భంగా గతేడాది నవంబర్ 1న ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఊహించని రీతిలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా.. తొమ్మిది మంది భక్తులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆలయం మూతపడి ఉంది.