మార్కాపురం మారణహోమం..14కి చేరిన మృతుల సంఖ్య
ప్రకాశం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత భీకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది
By - Knakam Karthik |
మార్కాపురం మారణహోమం..14కి చేరిన మృతుల సంఖ్య
ప్రకాశం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత భీకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జగిత్యాల నుండి నెల్లూరు జిల్లా కళిగిరికి వెళ్తున్న చందూ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగగా, నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేక కనీసం 14 మంది సజీవదహనమయ్యారు. మంటలు క్షణాల్లోనే వాహనాలను చుట్టుముట్టడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉండగా, బస్సు డ్రైవర్ మరియు టిప్పర్ డ్రైవర్‌తో సహా మరో 23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై మార్కాపురం ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ, మృతుల సంఖ్య 14కు చేరిందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు సూచించారు.