మార్గదర్శి చిట్ ఫండ్ కేసు: సీఐడీ విచారణకు రామోజీరావు గైర్హాజరు
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఏ1 గా ఉన్న ఆ సంస్థ చైర్మన్ రామోజీరావుకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 5 July 2023 10:54 AM ISTమార్గదర్శి చిట్ ఫండ్ కేసు: సీఐడీ విచారణకు రామోజీరావు గైర్హాజరు
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఏ1 గా ఉన్న ఆ సంస్థ చైర్మన్ రామోజీరావుకి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ స్పష్టం చేసింది. మరికొందరు నిందితులతో కలసి రామోజీని విచారించాల్సి ఉందని, అందుకే ఆయన గుంటూరుకి రావాలని సీఐడీ 41ఏ సీఆర్పీసీ కింద మరోసారి నోటీసులిచ్చింది. మార్గదర్శి కేసులో జులై 5న ఉదయం 10:30 గంటలకు గుంటూరులోని కన్నవారితోటలో మెడికల్ కాలేజీ వెనక ఉన్న సీఐడీ కార్యాలయానికి రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ డీఎస్పీ రవికుమార్ పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే గుంటూరులో సీఐడీ విచారణకు హాజరుకాలేమని తెలిపినట్లు సమాచారం.
అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేమని ఈ మెయిల్ ద్వారా సీఐడీ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చందాదారుల డబ్బులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టానికి వ్యతిరేకంగా సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, ఆర్బీఐ రూల్స్‌కి విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చందాదారుల డబ్బులను అక్రమంగా మళ్లించారు.. కాబట్టి నిందితులను ఏపీలో విచారించడం సరైందని సీఐడీ భావిస్తోంది. మరోవైపు మార్గదర్శి వ్యవహారంలో వీలైనంత వరకు విచారణను తప్పించుకోడానికి, కోర్టు కేసులను వాయిదాలతో నెట్టుకు వచ్చేందుకే రామోజీరావు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.