హిడ్మాను హత్య చేసి ఎన్‌కౌంటర్ అని కట్టుకథ అల్లారు.మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది.

By -  Knakam Karthik
Published on : 21 Nov 2025 2:34 PM IST

Andrapradesh, Maoist Party, Central Committee, Hidma encounter

హిడ్మాను హత్య చేసి ఎన్‌కౌంటర్ అని కట్టుకథ అల్లారు.మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నట్లు ప్రకటన రిలీజ్ చేసింది. కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్ కౌంటర్ కట్టుకథను అల్లారు. ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచౌడవరం ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు. ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా 'నవంబర్ 23'న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం..అని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

నేడు దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని సహచరి కామ్రేడ్ రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది.

కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ఐబీ నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలు. తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి, ఉద్యమ స్పూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్ శంకర్ (ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు), కామ్రేడ్ రాజే (రీజినల్ కమిటీ సభ్యురాలు)లకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది. కామ్రేడ్ చైతు (పీపీసీఎం), కామ్రేడ్ కబ్లూ (పీపీసీఎం), కామ్రేడ్ మల్లాల్ (పీపీసీఎం), కామ్రేడ్ దేవే (పీఎం)లు తమ కర్తవ్య నిర్వహణలో తమ ఆమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్పూర్తిని నిలబెట్టిన వీరికి సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోంది..అని మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది.

Next Story