ఆంధ్రప్రదేశ్: ఈ సీజన్‌లో మామిడి దిగుబడి పెరిగే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లోని మామిడిపండ్ల ప్రియులకు శుభవార్త. త్వరలోనే మామిడి పండ్ల సీజన్‌ రాబోతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Feb 2023 3:15 PM IST
Mango yield, Andhra Pradesh, mango news, Mango lovers

ఈ సీజన్‌లో మామిడి దిగుబడి పెరిగే అవకాశం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మామిడిపండ్ల ప్రియులకు శుభవార్త. త్వరలోనే మామిడి పండ్ల సీజన్‌ రాబోతోంది. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ దిగుబడి రావచ్చు. మామిడి చెట్లు పూయడంలో జాప్యం, అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా గత సీజన్‌లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మామిడి నాణ్యత, పరిమాణం తగ్గిపోయింది. గతేడాది సగటున హెక్టారుకు 10- 12 టన్నులు ఉండగా 6-8 టన్నులు మాత్రమే వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, విజయనగరం జిల్లాలు దేశంలోనే అత్యుత్తమ మామిడి రకాల్లో ఒకటి. ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు పండ్లను ఎగుమతి చేస్తారు. దేశంలోనే అత్యధికంగా మామిడిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.

ఏప్రిల్ వరకు పొడి వాతావరణం కొనసాగితే రాష్ట్రంలో ఈ ఏడాది హెక్టారుకు 12 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అదనపు సంచాలకులు ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

''గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 2022లోని అసమతుల్య వాతావరణం కొన్ని జిల్లాల్లో మామిడి పూత పుష్పించేలా ప్రభావితం చేసింది. మొత్తంగా ఈ సీజన్‌లో దాదాపు 60 నుండి 80% చెట్లు పూలు పూశాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఫలాలు కనిపిస్తున్నాయి'' అని చెప్పారు.

ఈ ఏడాది ఎక్కువ రాబడి వచ్చే అవకాశం

రాష్ట్రంలోని చాలా మంది మామిడి రైతులు బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపురి, నీలం, సువర్ణరేఖ రకాలను పెంచుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రీమియం రకాల్లో ఒకటి బెనిషన్ లేదా బంగిన్‌పల్లి. ప్రపంచ మార్కెట్‌లోనూ సువర్ణరేఖ రకానికి డిమాండ్‌ ఉంది.

మామిడి ఎగుమతిదారులు అన్నమయ్య జిల్లాలో పండే మామిడి పండ్లకు అధిక నాణ్యత, ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నందున వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని వెంకటేశ్వరులు తెలిపారు.

మామిడి పండ్ల ఎగుమతి పరిమాణం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మామిడి రైతులు, వ్యాపారులు తమ మామిడి ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌తో పోలిస్తే విదేశాలకు ఎగుమతి చేస్తే కనీసం 30 నుంచి 40% ఎక్కువ ఆదాయం వస్తుందని మామిడి ఎగుమతిదారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ 2019లో వివిధ దేశాలకు 1,600 మెట్రిక్ టన్నుల మామిడిపండ్లను (బంగినపల్లి, రసాలు, కొన్ని ఇతర రకాల పండ్లు) ఎగుమతి చేసింది. కోవిడ్-19 2020, 2021లో మామిడి ఎగుమతిని దెబ్బతీసింది.

''బంగినపల్లి రకం ధర కనీసం ఈ సీజన్‌లో టన్నుకు రూ. 30,000. గత కొన్నేళ్లుగా నష్టాలు చవిచూశాం. ఈ ఏడాది తీపి రాబడులు వస్తాయని ఆశిస్తున్నాం'' అని విజయనగరం జిల్లాకు చెందిన మామిడి రైతు కె. అప్పల నాయుడు అన్నారు.

ప్రధానాంశాలు

· రాష్ట్రంలో 3.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి సాగు చేయబడుతోంది. దీని ఉత్పత్తి సుమారు 45 నుండి 50 లక్షల టన్నులు.

· రైతులు ఆంధ్ర ప్రదేశ్‌లో బంగినపల్లి, రసాలు, తోతాపురి, సువర్ణరేఖ రకాలను పెంచుతారు.

· ఏపీలో మొత్తం మామిడి విస్తీర్ణంలో దాదాపు 60% బంగినపల్లి రకం సాగులో ఉంది.

· ఏపీ నుండి దాదాపు 10% మామిడి ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయి.

· అన్నింటిలో బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖకు మామిడి ప్రియుల నుండి డిమాండ్ కనిపిస్తోంది.

· సాధారణంగా, ఏప్రిల్ రెండవ వారం నుండి రాకపోకలు ఊపందుకుంటాయి.

Next Story