సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న బాలిక.. ఆ ఒక్క ఐడియాతో..

చుట్టూ చిమ్మ చీకటి.. మరోవైపు తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోతున్నారు. ఒకవేళ పట్టు తప్పితే ప్రాణాలు పోతాయి. అలాంటి పరిస్థితిలో బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించింది.

By అంజి  Published on  7 Aug 2023 11:23 AM IST
apnews, Konaseema,Ravulapalem

సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న బాలిక.. ఆ ఒక్క ఐడియాతో..

ఆ చిన్నారి సమయస్ఫూర్తికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఓ పక్క ప్రాణం పోతుందేమోనన్న భయం.. మరోపక్క తల్లి, చెల్లి నదిలో కొట్టుకుపోయారన్న బాధ. చుట్టూ చిమ్మ చీకటిలో వంతెన పై వేలాడుతూ తాను బతుకుతాను లేదో అన్న ఆవేదన. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే బతుకుపై ఆశలు వదులుకుంటారు. కానీ ఆ బాలిక సమయస్ఫూర్తితో ఆలోచించి 100కు డయల్‌ చేసి ప్రాణాలు దక్కించుకుంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కోనసీమ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి.శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన బాలిక తల్లి సుహాసిని (30) ఉలవ సురేష్ (30)తో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు.

తాడేపల్లిలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండగా మహిళకు అతడితో పరిచయం ఏర్పడింది. వారి సంబంధం కొనసాగింది. కొన్ని రోజులకు సుహాసిని ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పుడు ఒక సంవత్సరం. ఆమెకు ఇంతకు ముందు వివాహం జరిగింది. ఆమె మొదటి వివాహం నుండి ఒక కుమార్తె ఉంది. ఆదివారం షాపింగ్‌కు అందరం రాజమహేంద్రవరం వెళ్దామని సురేష్ కుటుంబ సభ్యులకు చెప్పి కారులో రావులపాలెం గౌతమీ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. సెల్ఫీ తీసుకునే నెపంతో బ్రిడ్జి దగ్గర ఆగాడు. సురేష్ వారిద్దరినీ వంతెనపై నుంచి నదిలోకి తోసేశాడు. బాలిక ప్రాణాలతో బయటపడగా, ఆమె సోదరి, తల్లి నీటిలో కొట్టుకుపోయారు. బాలిక పైపును పట్టుకుని ఉంది.

ప్రాణాలు దక్కించుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషించింది. చివరకు తన జేబులో ఉన్న ఫోన్ దొరకడంతో మెరుపులాంటి ఆలోచన చేసింది. జేబులోంచి సెల్‌ఫోన్‌ని తీసి పోలీసులు వచ్చి తనను రక్షించమని '100'కి డయల్ చేసింది. వెంటనే స్పందించిన ఎస్ఐ వెంకటరమణ నేషనల్ హైవే సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాల్ అందుకున్న అరగంట సమయంలో పోలీసులు బాలికను రక్షించగలిగారు. వారు అక్కడికి చేరుకునే సమయానికి ఆమె ప్రమాదకరంగా పైపును పట్టుకుంది. పోలీసులు ఆమెను సురక్షితంగా పైకి లాగారు. నిందితుడు అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబంపై కర్కశానికి దిగిన సురేష్ ను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు.

Next Story