హృదయవిదారకం : డబ్బులు లేక భాష రాక.. భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ
Man Carries Wife Dead body on Shoulders.అయినవారు చనిపోతే వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2023 8:09 AM ISTఅయినవారు చనిపోతే వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు కొందరు పడే కష్టం అంతా ఇంతా కాదు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఒక కారణం అయితే కాస్త దూరానికి కూడా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు భారీ మొత్తాన్ని అడుగుతుండడం మరో కారణం. ఏదైనా కానివ్వండి వారి మృతదేహాలను వాహనాల్లో తరలించే స్తోమత లేక చేతులపై తీసుకువెళ్లిన ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా విజయనగరం జిల్లాలో అలాంటి హృదయవిదారక ఘటన జరిగింది. భార్య మృతదేహాన్ని భుజానా మోసుకుంటూ ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు బయలుదేరాడు. నాలుగు కిలో మీటర్లకు పైగా నడిచాడు. చలించిన పోలీసులు అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు.
ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం సొరడ గ్రామంలో సాములు దంపతులు నివసిస్తుంటారు. సాములు భార్య ఈడె గురు(30) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను విశాఖ జిల్లా తగరపువలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వారం రోజుల క్రితం తీసుకువచ్చాడు సాములు. చికిత్స అందించినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఉన్న డబ్బు అంతా ఖర్చైంది.
చేతిలో చిల్లి గల్వ కూడా లేకపోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో సాములు, అతడి భార్య ఈడె గురులు సాలూరు వెళ్లి అక్కడి నుంచి మరో వాహనంలో స్వగ్రామానికి చేరుకోవాలని బావించారు. ఓ ఆటోను మాట్లాడుకుని అందులో ఎక్కారు. ఆటో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వంతెన వద్దకు చేరుకోగానే ఈడె గురు చనిపోయింది.
ఆటో డ్రైవర్ మృతదేహాన్ని అక్కడే దింపేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో సాములుకు అర్థం కాలేదు. డబ్బులు కూడా లేవు. దిక్కుతోచని పరిస్థితుల్లో భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని సాలూరు కి నడవసాగాడు. ఆయనకు సరైన మార్గం కూడా తెలియదు. ఆ దారిన ఉన్న వారిని సాలూరు ఎటువైపు అని అడుగుతూ ముందుకు సాగాడు. అయితే.. అతడికి తెలుగు రాకపోవడంతో ఆయన అడిగేది ఎవ్వరికి అర్థం కాలేదు.
దారి తెలియక సాలూరు వైపు కాకుండా వచ్చిన దారిలోనే వెనక్కి నాలుగు కిలోమీటర్లకు పైగా నడిచాడు. కొందరు గమనించి గంట్యాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ టి.వి తిరుపతిరావు, ఎస్సై కిరణ్‌కుమార్‌లు అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సాములు స్వగ్రామం 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓ ప్రైవేటు అంబులెన్స్ మాట్లాడి స్వగ్రామానికి పంపించారు. భార్యను కోల్పోయి దుఃఖంలో మునిగిపోయిన అతడికి పోలీసులు మానవత్వంతో సాయం చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.