ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి, మందస రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి 15 బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలులోని ఏ1 ఏసీ కోచ్ దగ్గర కప్లింగ్ దెబ్బతింది. దీంతో 15 బోగీలు విడిపోయాయి. అప్రమత్తమైన లోకోపైలట్.. వెంటనే రైలును అక్కడికక్కడే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి హావ్‌రా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సుమారు 2 గంటల పాటు రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైలు ఇంజిన్ వైపు ఉన్న బోగీలను మందస రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. బోగీలను జాయింట్ చేసిన తర్వాత రైలు హావ్ రాకు బయల్దేరుతుంది. రైలు రెండు భాగాలు కావడంతో ఆ రూట్‌లో పలు ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.