కీర్తి చక్ర అందుకున్న మేజర్ నాయుడు.. ఆయన చేసిన సాహసం ఏమిటో తెలుసా?
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగమైన మేజర్ మళ్ల రామ గోపాల్ నాయుడుకు భారతదేశపు రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర లభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2024 1:15 PM ISTకీర్తి చక్ర అందుకున్న మేజర్ నాయుడు.. ఆయన చేసిన సాహసం ఏమిటో తెలుసా?
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగమైన మేజర్ మళ్ల రామ గోపాల్ నాయుడుకు భారతదేశపు రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర లభించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్‌గోపాల్ నాయుడికి కీర్తి చక్ర పురస్కారం అందించారు. 2023 అక్టోబర్ 26న జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన బృందానికి రామ్ నాయకుడిగా ఉన్నారు. టెర్రరిస్టులను ఏరివేయడంతో పాటు తన టీంను కాపాడటంతో కేంద్రం ఈ పురస్కారంతో గౌరవించింది.
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు నాలుగు కీర్తి చక్రలు, 18 శౌర్య చక్రలను ప్రదానం చేశారు. రెండవ అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రలను అందుకున్న నలుగురిలో మేజర్ నాయుడు మాత్రమే బ్రతికి ఉన్నారు. మరో ముగ్గురు సైనికుల మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన మేజర్ నాయుడు గ్రెనేడ్ దాడి నుండి బయటపడడమే కశ్మీర్‌లో ఉగ్రవాదులను నిర్మూలించే సమయంలో తన సైనికులను ప్రాణాలకు తెగించి రక్షించారు. సజీవంగా ఉంటూ ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి రామ్‌గోపాల్ కావడం విశేషం. సైనిక్ స్కూల్ కోరుకొండ పూర్వ విద్యార్థి, మేజర్ నాయుడు 2012లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. తర్వాత అతను 2016లో ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యారు. అతను ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సాధించి ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. అతను ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు.
అక్టోబర్ 26, 2023న, 56 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ రామ గోపాల్ నాయుడు నేతృత్వంలోని బృందం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక ఆపరేషన్ లో భాగం అయ్యారు. ఆయన స్కౌట్ చేస్తున్నప్పుడు ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించారు. వారిని ట్రాప్ చేయడానికి ఆకస్మిక దాడికి దిగాడు. ఈ సమయంలో తీవ్రవాదులు కూడా భీకర కాల్పులు జరిపారు. అదే సమయంలో మేజర్ నాయుడు ఒక టెర్రరిస్ట్ స్థానాన్ని గుర్తించారు. కానీ శత్రువుల నుండి భారీగా కాల్పులు వస్తుండడంతో ప్రమాదం ఉన్నప్పటికీ.. అతను ఒక టెర్రరిస్టును అతి సమీపం నుండి హతమార్చారు. మరొకరికి గాయాలయ్యాయి. ముగ్గురు ఉగ్రవాదులను అగ్నితో చంపేశారు మేజర్ రామ గోపాల్. ఐదవ ఉగ్రవాది ఒక గుహ నుండి కాల్పులు జరిపారు.. మేజర్ నాయుడుపై గ్రెనేడ్లు విసిరారు, అయినప్పుడు తృటిలో తప్పించుకోగలిగారు. ఆ తర్వాత మిగిలిన ఉన్న తీవ్రవాదిని కూడా మట్టుబెట్టారు. మేజర్ నాయుడుకు వివాహమై రెండేళ్ల కుమార్తె ఉంది.
త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. 4 కీర్తి చక్రాలు, 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్, ఒక ప్రెసిడెంట్ తట్‌రక్షక్ మెడల్, మూడు తట్‌రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు.