అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ప్రభుత్వ బడుల్లో తరహాలోనే జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజనాన్ని అందించనుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభిస్తారని భావించినా.. పలు అనివార్య కారణాల రీత్యా.. ఈ నెల 4వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్‌ను అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కార్ రూ.115 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూటమి ప్రభుత్వం పక్కా ప్లానింగ్‌తో పలు సంస్కరణలు చేపట్టింది. ఈ క్రమంలోనే పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది.
‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం’ పేరుతో ఇంటర్ విద్యార్థులకు ఈ నెల నాలుగో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అందుబాటులోకి వస్తున్నది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట (ఏఎల్‌పురం)లో, హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేటలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులు భోజనం చేసేందుకు అవసరమైన పళ్లాలు, గ్లాసులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది.