ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: సీఎం రేవంత్, షర్మిల
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.
By అంజి Published on 17 March 2024 7:58 AM ISTఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: సీఎం రేవంత్, షర్మిల
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైజాగ్‌లో జరిగిన భారీ బహిరంగసభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి, కార్యకర్తలకు, నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. ''విశాఖ ఉక్కు ఇందిరమ్మ నెలకొల్పిన పరిశ్రమ. అప్పుడు నష్టాల్లో ఉంటే నిధులు ఇచ్చి మరీ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. వైఎస్సార్ హయాంలో విశాఖ కోసం ఎంతో చేశారు. వైఎస్సార్ బతికి ఉంటే విశాఖ ఉక్కుకు సొంత మైన్ ఉండేది'' అని షర్మిల అన్నారు.
''దొంగలు దొంగలు ఊరులు పంచుకున్నట్లు విశాఖ ఉక్కును దోచుకోవాలని చూస్తున్నారు. అప్పుల పేరు చెప్పి ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ గంగవరం పోర్టును జగనన్న కేవలం 600 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క ఉద్యమైనా చేయలేదు. అటు చంద్రబాబు ఏమో తన రాజకీయ స్వలాభం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. జగన్, బాబు ఇద్దరూ మోదీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి వాళ్లను గెలిపించడం అవసరమా..? ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయండి'' అని షర్మిల కోరారు.
మరోవైపు ఈ సభకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తోంది. షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి.. ఆమె ముఖ్యమంత్రి అయ్యేవరకు అండగా నేనుంటా. ఏ కష్టమొచ్చినా నేను చూసుకుంటా.. ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం.. మీరు సిద్ధమా? సై'' అని అన్నారు.