యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి ఆలయానికి చోటు
Lepakshi Temple is on the provisional list of UNESCO world heritage sites.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం అరుదైన గుర్తింపు పొందేందుకు అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చే యునెస్కో.. లేపాక్షి ఆలయాన్ని వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చింది. భారత దేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా.. అందులో ఏపీ నుంచి లేపాక్షి ఆలయం ఉండడం గమనార్హం. మరో ఆరు నెలల్లో వారసత్వ కట్టడాలపై యునెస్కో తుది జాబితా విడుదల చేయనుంది. అందులో కనుక లేపాక్షి ఆలయానికి చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఆలయానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
ఇక శిల్ప సంపదకు నెలవైన లేపాక్షి వారసత్వ కట్టడాల జాబితాలో తాత్కాలిక గుర్తింపు దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 16వ శతాబ్దంలో విరూపన్నా, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాతును ఒకవైపు నుంచి ఇంకోవైపుకు తీయొచ్చు
లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరాముడు.. లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథ ప్రకారం చూస్తే.. అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.